శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం తొలి కార్యదర్శి రావిచెట్టు రంగారావు గారు స్థాపించిన విజ్ఞాన చంద్రికా గ్రంథమాల ద్వారా ప్రసిద్ధ రచయితలచేత విలువైన గ్రంథాలను రచింపజేసి, వాటిని సరసమైన ధరలకు పాఠకులకు అందుబాటులో ఉంచిన స్ఫూర్తిదాయక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రస్తుత అధ్యక్షులు డా. కె.వి. రమణాచారి గారి నేతృత్వంలో భాషానిలయానికి సేవలందించిన ప్రముఖుల లఘు జీవితచరిత్రలు, తెలంగాణ ప్రముఖుల గురించిన పలు గ్రంథాలను ప్రచురించడం జరిగింది.
ఈ సాహిత్య సేవా పరంపరలో భాగంగా, తెలుగు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు మరియు గ్రంథాలయానికి పాఠకులను, సాహిత్య సభలకు ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేందుకు “పుస్తక ప్రసాదం” అనే వినూత్న పథకాన్ని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం ప్రారంభిస్తోంది.
ఈ పథకం కింద భాషానిలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికీ ఒక పుస్తకాన్ని ఉచితంగా అందజేయబడుతుంది. ఆ పుస్తకం శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం ప్రచురించిన గ్రంథం కావచ్చు లేదా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న ఇతర రచయితల గ్రంథం కావచ్చు.
గ్రంథాలయ సందర్శకుల సంఖ్య పెరిగే కొద్దీ, గ్రంథాలయ రిజిస్టర్‌లో నమోదు కాకుండా నిల్వలో ఉన్న పుస్తకాలను కూడా ఈ పథకం ద్వారా పాఠకులకు అందించాలని నిర్ణయించాం. అదేవిధంగా, ఇతర రచయితలు, ప్రచురణకర్తలు లేదా పుస్తకాభిమానులు తమ గ్రంథాలను ఈ కార్యక్రమానికి అందజేస్తే వాటిని సాదరంగా స్వీకరిస్తాం.
పుస్తకాన్ని తీసుకున్న పాఠకుడు దానిని చదివిన అనంతరం తిరిగి గ్రంథాలయానికి అందజేయవచ్చు. అలాగే తన వద్ద ఉన్న ఇతర పుస్తకాలను కూడా భాషానిలయానికి బహూకరించవచ్చు. అలా సేకరించిన పుస్తకాలను అవసరమైన ఇతర పాఠకులకు తిరిగి అందించడం ద్వారా పుస్తక పఠన సంస్కృతిని విస్తరింపజేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ “పుస్తక ప్రసాదం” పథకాన్ని హైదరాబాద్ రాష్ట్ర ప్రథమ ప్రజాముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు గారి జయంతిని పురస్కరించుకుని 2026 మార్చి 13వ తేదీ సాయంత్రం శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో ఘనంగా ప్రారంభించారు.
తెలుగు భాషా, సాహిత్యాభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి.

పుస్తక ప్రసాదం – నియమ నిబంధనలు
- పుస్తక ప్రసాదం పథకంలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం గ్రంథాలయంలోని కథా సంపుటాలు, నవలలు, స్మృతిగ్రంథాలు, భాషానిలయం ప్రచురించిన పుస్తకాలు, అలాగే ఒకటి కంటే ఎక్కువ ప్రతులు ఉన్న ఇతర తెలుగు పుస్తకాలు చేర్చబడతాయి.
- పుస్తక ప్రసాదం కోసం ఎంపిక చేసిన పుస్తకాలను ప్రత్యేక ప్రదర్శన ప్రదేశంలో ఉంచుతారు. పాఠకులు తమకు నచ్చిన పుస్తకాన్ని స్వేచ్ఛగా ఎంపిక చేసుకొని తీసుకువెళ్లవచ్చు.
- దాతలు అందించిన పుస్తకాలలో ఉపయోగకరమైనవి, పాఠకులకు ఆసక్తికరమైనవి కూడా ఈ పథకంలో చేర్చబడతాయి.
- భాషానిలయం నుండి పుస్తక ప్రసాదం పథకంలోకి వచ్చే ప్రతి పుస్తకాన్ని ముందుగా డిజిటల్ రూపంలో స్కాన్ చేసి భద్రపరుస్తారు. భవిష్యత్తులో వాటిని పరిశోధన, అధ్యయన అవసరాల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటారు.
- ప్రతి పుస్తకానికి కనీసం ఒక ప్రతిని భాషానిలయం గ్రంథాలయంలో శాశ్వతంగా భద్రపరుస్తారు. ఆ ప్రతులు బయటకు ఇవ్వబడవు. అవి పరిశోధన, సూచన గ్రంథాలుగా మాత్రమే ఉపయోగించబడతాయి.
- దాతలు అందించే పుస్తకాలలో గ్రంథాలయానికి అవసరమైన వాటిని ప్రత్యేక రిజిస్టరులో నమోదు చేసి భద్రపరుస్తారు. మిగిలిన పుస్తకాలను పుస్తక ప్రసాదం పథకం ద్వారా పాఠకులకు అందజేస్తారు.
- పుస్తక ప్రసాదం పథకం ద్వారా పంపిణీ చేసే ప్రతి పుస్తకంపై భాషానిలయం ప్రత్యేక ముద్ర (స్టాంపు) వేయబడుతుంది.
- ఈ పథకం నిర్వహణ కోసం ప్రత్యేక రిజిస్టరు నిర్వహించబడుతుంది. పుస్తకాల వివరాలు, పంపిణీ వివరాలు అందులో నమోదు చేయబడతాయి.
- పుస్తక ప్రసాదం పథకం నిర్వహణ, పర్యవేక్షణ కోసం భాషానిలయం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. పథక నిర్వహణ బాధ్యత ఆ కమిటీకి ఉంటుంది.
- తెలుగు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం, పుస్తకాల వినియోగాన్ని పెంచడం మరియు పాఠకులను గ్రంథాలయంతో అనుసంధానించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం